ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 7:34 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

అర్నబ్ తుపాను అనంతర చర్యలు.. రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్! అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనుల వేగవంతం అంటువ్యాధుల నివారణకు పవన్ కల్యాణ్ ఆదేశాలు 9 జిల్లాల నుంచి 475 మంది సిబ్బందితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు

అమ‌రావ‌తి,అర్జున్ సమాచారం:
అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని, ప్రజారోగ్యం విషయంలో ఎలాంటి ఆపద తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు త్వరగా నెలకొనేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలను వేగంగా అమలు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 9 జిల్లాల నుంచి మొత్తం 475 మంది సిబ్బందితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటాయి.  అదేవిధంగా, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి నాణ్యతను పరిశీలించేందుకు ప్రత్యేక వాటర్ టెస్టింగ్ బృందాలను కూడా రంగంలోకి దించారు. నీటి ద్వారా వ్యాధులు ప్రబలకుండా నివారించడం, పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడంపై ఈ బృందాలు దృష్టి సారిస్తాయి.